కడప జిల్లాలో పసుపు జెండా ఎగిరేనా?

కడప జిల్లాలో పసుపు జెండా  పాతడానికి తెలుగుదేశం శతవిధాలా ప్రయత్నిస్తోంది. గండికోట ప్రాజెక్టును పూర్తి చేసి తద్వారా కడప జిల్లాలో సాగునీరందించి జగన్ కు సవాల్ విసరాలని భావిస్తోంది. ఈ మేరకు అన్ని పనులూ చకచకా పూర్తయ్యాయి. కాని వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో పసుపదళం ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నదే  ప్రశ్న.

బాబు ప్రత్యేక దృష్టి…
తెలుగుదేశం అధికారం చేపట్టిన నాటి నుంచి కడప జిల్లాపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. జగన్ ను రాజకీయంగా ఒంటరి చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేసి అక్కడి ప్రజల మన్ననలను పొందేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే గండికోట ప్రాజెక్టును పూర్తి చేశారు. తన వల్లే ప్రాజెక్టు పూర్తయి కడప జిల్లా వాసులకు తాగు, సాగునీరందుతుందని చంద్రబాబు చెబుతున్నారు. వైఎస్ హయాంలో చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు. గండికోట నిర్వాసితులకు ఇటీవలే 480 కోట్ల నష్టపరిహారం ఇచ్చేందుకు కేబినెట్ కూడా ఆమోదించింది. తాజాగా గండికోట నుంచి పైడిపాలెం జలాశయానికి చంద్రబాబు బుధవారం నీటిని విడుదల చేయనున్నారు. ఇందుకు చంద్రబాబు బుధవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు.

బాబు గొప్పల్లో నిజం లేదు….
మరోవైపు కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న జగన్ మాత్రం తన  తండ్రి వైఎస్ చేపట్టిన పథకాలు 90 శాతం పూర్తయితే మిగిలింది చంద్రబాబు పూర్తి చేసి తానే భగీరధుడినని చాటు కోవడం విడ్డూరమంటున్నారు. 700 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పైడిపాలెం ప్రాజెక్టు పనులు వైఎస్ హాయంలోనే 95 శాతం పూర్తయ్యాయని, చంద్రబాబు కేవలం 24 కోట్లు మాత్రమే వెచ్చించి ప్రాజెక్టు పూర్తికావడానికి తానే కారణమంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. మొత్తం మీద కడప జిల్లాలో పాగా వేసేందుకు టీడీపీ అన్నిరకాలుగా ప్రయత్నిస్తోంది. కాని వైఎస్ ఫ్యామిలీ ఇలాకాలో అది సాధ్యమేనా? అన్నది ప్రశ్న. వేచి చూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*